SriRama Prana Pratishta : రామయ్యా.. వచ్చాడయ్యా!

5 శతాబ్దాల తర్వాత సొంత గూటికి శ్రీరాముడు

అయోధ్యలో ఆవిష్కృతమైన ఆధ్యాత్మిక అద్భుతం

సాకేతపురిలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ

కళ్లకు కట్టిన వస్త్రం తీసి.. కాటుక దిద్ది.. అద్దం చూపి

నరేంద్ర మోదీ చేతుల మీదుగా చారిత్రక మహోత్సవం

తొలి హారతి ఇచ్చి దర్శనం చేసుకున్న ప్రధాని మోదీ

అభిజిత్‌ లగ్నంలో 84 సెకన్లపాటు కొనసాగిన క్రతువు

గర్భగుడిలో యోగి, ఆనందీ, మోహన్‌ భాగవత్‌ కూడా

తర్వాత శివుడికి అభిషేకం, జటాయు విగ్రహావిష్కరణ

రామ మందిర నిర్మాణ కార్మికులకు మోదీ సత్కారం

8000 మందికిపైగా అతిథులు కార్యక్రమానికి హాజరు

దాదాపు నాలుగు దశాబ్దాల కిందట దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రామ భక్తులు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇటుకలు పంపించారు గుర్తుందా!? ఆ ఇటుకలు ఎప్పుడో మట్టిలో కలిసి పోయాయి! కానీ, ఆ సంకల్పం ఇప్పుడు దివ్య, నవ్య, భవ్య రామ మందిరంగా కళ్ల ముందు సాక్షాత్కరించింది!

రాముడి వనవాసం 14 ఏళ్లే! కానీ, అయోధ్యలో శ్రీరాముడికి మందిరం నిర్మించాలన్న హిందువుల పోరాటానికి మాత్రం 500 ఏళ్లు! ఐదు శతాబ్దాల ఆ ఉద్యమం దైవత్వం ఉట్టిపడే ప్రసన్న బాల రాముడి రూపంలో ఇప్పుడు ఫలించింది!

అయోధ్య, జనవరి 22: మనం జీవించి ఉండగా ఈ జన్మలో కళ్లజూస్తామా!? అని ఎంతోమంది భారతీయులు ఆకాంక్షించిన అద్భుతం అయోధ్యలో ఆవిష్కృతమైంది! అక్కడ రామ మందిరం నిర్మించాలన్న హిందువుల కల సాకారమైంది! టెంట్‌లో ఉన్న రాముడు మందిరంలోకి రావాలన్న రామ భక్తుల ఆకాంక్ష ఫలించింది! భారత రాజకీయ, ఆధ్యాత్మిక చరిత్రలోనే మహోన్నత ఘట్టానికి శ్రీకారం చుట్టుకుంది! అయోధ్యలో దాదాపు 8000 మంది అతిథులు; ప్రపంచవ్యాప్తంగా టీవీ తెరలపై కోట్లాదిమంది భారతీయులు భక్తి తన్మయత్వంతో చూస్తుండగా సాకేతపురిలో కొత్తగా నిర్మించిన ఆలయంలో 51 అంగుళాల(4.25 అడుగుల) బాల రాముడు కొలువుదీరాడు! ప్రధాని మోదీ చేతుల మీదుగా రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుక సోమవారం అభిజిత్‌ లగ్నంలో అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మధ్యాహ్నం 12 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. తొలుత ప్రధాని మోదీ స్వామి వారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. సరిగ్గా 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకూ అంటే 84 సెకన్లపాటు రామయ్య ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. పండితులు మూల మంత్రాలను పఠిస్తుండగా.. తొలుత, విగ్రహం కళ్లకు అచ్చాదనగా కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగించారు. అనంతరం, బంగారంతో చేసిన చిన్న కడ్డీతో బాల రాముడి కళ్లకు కాటుక దిద్దారు. తర్వాత ఆయనకు అద్దాన్ని చూపించారు. చివరిగా, తొలి మహా హారతిని మోదీ ఇచ్చారు. తామర పువ్వును రాముడి పాదాల వద్ద ఉంచి, సాష్టాంగ నమస్కారం చేశారు. దీనితో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తయింది. ఆ వెంటనే, ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణం ధరించిన ఐదు సంవత్సరాల అయోధ్య రాముడు చిరు మందహాసం, ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిచ్చాడు. పసుపు రంగు పంచె, రాళ్లు పొదిగిన స్వర్ణాభరణాలు, ఎరుపు, పసుపు, వంకాయ రంగు పువ్వులతో కూడిన దండలు ధరించిన రామయ్య నయనానందకరంగా కనిపించాడు. దాంతో, జైశ్రీరాం నినాదాలు అయోధ్యలో మార్మోగాయి. కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీతోపాటు ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎ్‌సఎస్‌ సర్‌ సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ మాత్రమే గర్భ గుడిలో ఆశీనులయ్యారు. తొలుత వారు రాముడిని దర్శించుకున్న తర్వాత అతిథులనూ అనుమతించారు. మంగళవారం నుంచి భక్తులు రాముడిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు ఐదారు అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న రామ్‌లల్లా విగ్రహాలనూ అక్కడే ఉంచారు. కార్యక్రమానికి 11 వేల మందికిపైగా అతిథులకు ఆహ్వానాలు పంపగా.. ఎనిమిది వేల మందికిపైగా ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అయోధ్య మహోత్సవాన్ని బీజేపీ రాజకీయం చేసిందని ఆరోపిస్తూ ప్రతిపక్షంతోపాటు వివిధ పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అనంతరం, అక్కడికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మోదీ సహా ఇతర నేతలు చేరుకున్నారు. అక్కడ అతిథులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘మన రాముడు తిరిగొచ్చాడు’ అని మోదీ అనడంతోనే జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. ఆ తర్వాత కుబేర్‌ తిల ప్రాంతంలోని శివ లింగానికి మోదీ అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో జటాయు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామ మందిర నిర్మాణంలో పాల్పంచుకున్న కార్మికులను సత్కరిస్తూ గులాబీ రేకులను వారిపై చల్లారు. చివరిగా, 11 రోజులపాటు తాను కొనసాగించిన అనుష్ఠానాన్ని ముగించి.. ఆలయ ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరి అందించిన ‘చర్నామృత్‌’ ప్రసాదాన్ని స్వీకరించారు.

మంగళ ధ్వనులతో మంత్రముగ్ధం

ప్రాణ ప్రతిష్ఠకు ముందు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన 50 రకాల సంప్రదాయ వాయిద్యాలతో రామచంద్ర ప్రభువుకు ‘మంగళ ధ్వనులు’ వినిపించారు. అనంతరం స్వరార్చన చేశారు. ఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ సహకారంతో అయోధ్యకు చెందిన ప్రముఖ కవి యతీంద్ర మిశ్రా దీనిని నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఢోలక్‌, ఫ్లూట్‌, పంఖవాజ్‌; ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఘటం; కర్ణాటక నుంచి వీణ; తమిళనాడు నుంచి నాగస్వరం, మృదంగం, తవిల్‌; పంజాబ్‌ నుంచి అగ్గోజా; మహారాష్ట్ర నుంచి సుందరి; ఒడిసా నుంచి మర్దల; మధ్యప్రదేశ్‌ నుంచి సంతూర్‌; ఛత్తీ్‌సగఢ్‌ నుంచి తంబుర; ఢిల్లీ నుంచి షెహనాయ్‌; జార్ఖండ్‌ నుంచి సితార్‌ తదితర వాయుద్యాలతో మంగళ ధ్వనులు మోగించారు. సోను నిగమ్‌, అనురాధా పౌఢ్వాల్‌, శంకర్‌ మహదేవన్‌ తదితరులు స్వరార్చన చేశారు. అలాగే, అయోధ్య వీధులన్నీ ‘రాముడొచ్చాడు’, ‘అవధ్‌కు రాముడొచ్చాడు’ తదితర పాటలతో మార్మోగాయి.

వజ్రాలు పొదిగిన ఆభరణాలు

బాలరాముడికి అలంకరించిన ఆభరణాలు మిరుమిట్లు గొలిపాయి. వజ్రాలు, కెంపులు, మరకతాలు పొదిగిన 14 రకాల ఆభరణాలను లఖ్‌నవూకు చెందిన హర్షహైమల్‌ శ్యామ్‌లాల్‌ జువెలర్స్‌ తయారు చేసింది. ఇవి యంత్రాలతో కాకుండా చేతితో చేసినవే కావడం విశేషం. వీటిలో తిలకం, ధనుస్సు, బాణం, కిరీటం, ఐదు పేటల విజయహారాలు, వడ్డాణం, చేతి పట్టీలు, కడియాలు, కాలిమువ్వలు, ముద్రిక ఉన్నాయి.

అమోఘ ‘తాళం’.. భక్తి ‘సంద్రం’

యూపీలోని అలీగఢ్‌ నుంచి 400 కిలోల భారీ తాళం అయోధ్యకు చేరింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ తాళాన్ని అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్‌ శర్మ, రామ్‌లల్లాకు కానుకగా ఇచ్చారు. సత్యప్రకాశ్‌, ఆయన భార్య రుక్మిణి దేవి, కుమారుడు మహేశ్‌ చంద్‌ ఈ భారీ తాళాన్ని తయారు చేశారు. అలాగే హైదరాబాద్‌ నుంచి 1265 కిలోల భారీ లడ్డూ కూడా అయోధ్యకు చేరింది. దీన్ని నాగభూషణం రెడ్డి ఆధ్వర్యంలోని శ్రీరామ్‌ కేటరర్స్‌ తయారు చేసింది. అయోధ్య రామయ్యకు తిరుపతి వెంకన్న నోరుతీపి చేశాడు. తిరుమల నుంచి లక్ష లడ్డూలు అయోధ్యకు చేరాయి. వీటిని అక్కడి భక్తులకు అందజేస్తారు. అయోధ్యలో కొండంత దేవుడు కొలువుతీరిన సందర్భంగా సముద్రుడి హృదయమూ భక్తితో ఉప్పొంగింది.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours