Ramdev Baba: ఓబీసీపై కాదు, ఒవైసీపై వ్యాఖ్యానించా.. వైరల్ వీడియోపై బాబా రామ్‌దేవ్

న్యూఢిల్లీ: ఓబీసీ (OBC)లపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఒవైసీ (Owaisi)పై వ్యాఖ్యలు చేశానని యోగా గురువు రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) చెప్పారు. ఓబీసీలను రామ్‌దేవ్ బాబా అవమానించారంటూ ఒక వీడియో వైరల్ కావడం, పతంజలి ఉత్పత్తులను బహిష్కరించండంటూ కొందరు ‘ఎక్స్’ వేదికగా పిలుపునివ్వడంపై ఆయన తాజా వివరణ ఇచ్చారు.

తాను బ్రాహ్మణుడనని, అగ్నిహోత్రి బ్రాహ్మణుడని రామ్‌దేవ్ పేర్కొన్న ఒక వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. ”నాది బ్రహ్మ గోత్రం. నేను అగ్నిహోత్రి బ్రాహ్మణుడను. బాబాజీ ఓబీసీ అని కొందరు అంటుంటారు. నేను వేద బ్రాహ్మణుడను, ద్వివేది బ్రాహ్మణుడను, త్రివేది బ్రాహ్మణుడను, చతుర్వేది బ్రాహ్మణుడను-నేను నాలుగు వేదాలు చదివాను” అని ఓ టీవీ ఛానెల్ కార్యక్రమంలో మాట్లాడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియోలో వైరల్ అయింది. దీంతో ఓబీసీలను అవమానించిన రామ్‌దేవ్‌పై చర్యలు తీసుకోవాలని, పతంజలి ఉత్పత్తులను బహిష్కరించాలని కొందరు డిమాండ్ చేశారు.

అలా అనలేదు..

వైరల్ వీడియోపై రామ్‌దేవ్ శనివారంనాడు స్పందిస్తూ, తాను ఓబీసీలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఒవైసీ గురించి వ్యాఖ్యానించానని చెప్పారు. ఒవైసీ పూర్వీకులు దేశ వ్యతిరేకులని, ఆయనను తాను సీరియస్‌గా తీసుకోనని అన్నారు. కాగా, రామ్‌దేవ్ బాబా తాజా వివరణపై అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్‌లో స్పందించారు. ఓబీసీ వ్యాఖ్యలపై రామ్‌దేవ్ బాబా ‘యూటర్న్’ తీసుకున్నారని విమర్శించారు.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours