Rakshana Nidhi: టికెట్ కేటాయించకుండా జగన్ నాకు అన్యాయం చేశారు

విజయవాడ: రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించ కుండా సీఎం జగన్ ( CM JAGAN ) అన్యాయం చేశారని తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి ( YCP MLA Rakshana Nidhi ) ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సీటు ఇవ్వకూడదని ముందుగానే ఒప్పందం జరిగిందన్నారు. వైసీపీకి చెందిన ఓ ఎంపీతో లోపాయికారిగా ఇచ్చిన మాట వల్ల జగన్ తనకు అన్యాయం చేశారని చెప్పారు. సర్వేలన్నీ తనకే అనుకూలంగా వచ్చాయన్నారు. పార్టీ కోసం జగన్‌ని నమ్మి దశాబ్ద కాలం పాటు పని చేశానని గుర్తుచేశారు. శుక్రవారం తన కార్యాలయంలో ఎమ్మెల్యే రక్షణ నిధి మీడియాతో మాట్లాడుతూ… తాను 2014, 2019లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇప్పుడు సీఎం జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి కూడా జగన్ మాట తప్పారన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను బూతులు తిట్టక పోవడమే తన అనర్హతకు కారణమని చెప్పారు.

అందుకే జగన్ దృష్టిలో పడలేదు

అన్ని పార్టీల నేతలతో, అన్ని వర్గాల ప్రజలతో మంచివాడినని అనిపించుకున్నానని.. అయినా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో తాను మాత్రం పడలేక పోయానని వాపోయారు. వైసీపీలో ప్రతిపక్ష నేతలను పచ్చి బూతులు తిట్టే వారికే పదవులు, సీట్లు ఇస్తారని ఎద్దేవా చేశారు. గడప గడపకు వైసీపీ అని తమను ప్రతి ఇంటికి తిప్పి ఇప్పుడు ఇళ్లల్లో కూర్చున్న వారికి సీట్లు ఇస్తే ఎలా గెలుస్తారని నిలదీశారు. వైసీపీ పెద్దల నిర్ణయంతో తన మనసుకు చాలా కష్టం కలిగిందన్నారు. టీడీపీ కంచుకోట అయినా ప్రాంతాలల్లో కూడా వైసీపీకి బలం పెంచానని అన్నారు. తన విధేయతను విస్మరించి… విమర్శలు చేసిన వారిని పిలిచి అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. అభిమానులు, కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. త్వరలో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు నిర్ణయాలను ప్రకటిస్తానని ఎమ్మెల్యే రక్షణ నిధి తెలిపారు.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours