Rahul : ఆశలన్నీ యూపీపైనే!

ఆ రాష్ట్రంలో 11రోజుల పాటు భారత్‌జోడో న్యాయ యాత్ర

రాహుల్‌ యాత్ర రూట్‌మ్యా్‌పలో అయోధ్య లేకపోవడంపై చర్చలు

న్యూఢిల్లీ, జనవరి 5: దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌ అత్యంత కీలకం. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరిగే 543 సీట్లలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా 80 స్థానాలు ఉన్నాయి. 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఇక్కడ ఏకంగా 73 సీట్లు గెలుచుకుంది. ఇక 2019లో 64 స్థానాల్లో విజయం సాధించింది. అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న బీజేపీకి చెక్‌ పెట్టడానికి యూపీపై దృష్టి సారించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ నుంచి ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో యూపీలో గత వైభవాన్ని తిరిగి సాధించే దిశగా కాంగ్రెస్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనవరి 14న రాహుల్‌గాంధీ చేపట్టనున్న భారత్‌ జోడో న్యాయ యాత్ర ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా 11 రోజుల పాటు సాగేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ వ్యవధిలో ఆయన 1,074 కిలోమీటర్లలో విస్తరించి ఉన్న 20 జిల్లాల్లో పర్యటించనున్నారు. రాహుల్‌ చేపట్టిన తొలివిడత భారత్‌ జోడో యాత్ర రూట్‌ మ్యాప్‌లో తొలుత యూపీ లేదు. చివరి నిమిషంలో ఈ రాష్ట్రాన్ని కూడా చేర్చారు. అప్పట్లో కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే ఆయన పర్యటించారు. ఈసారి మాత్రం రెండో విడత యాత్ర కీలక నియోజకవర్గాల మీదుగా సాగేవిధంగా అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుంది. అయితే రామమందిరం నిర్మాణాన్ని ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తున్న అయోధ్య స్థానంలో యాత్ర చేయకూడదని రాహుల్‌ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. రాహుల్‌ యాత్రను అయోధ్యకు మళ్లించే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వారాణసీలో మోదీని ఢీకొట్టేదెవరు?

ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారాణసీలో ప్రియాంక పోటీచేయాలని ఇటీవల మమతా బెనర్జీ ప్రతిపాదించారు. కానీ గాంధీల విషయంలో అంత రిస్క్‌ తీసుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా, ఒకప్పుడు కాంగ్రె్‌సకు కంచుకోటలైన అమేఠీ, రాయ్‌బరేలీని తిరిగి చేజిక్కిచుకోవడమే లక్ష్యంగా ఈ స్థానాల్లో భారత్‌ జోడో న్యాయ యాత్ర సాగనుంది. గత ఎన్నికల్లో ఇక్కడ స్మృతి ఇరానీ… రాహుల్‌ను చిత్తుగా ఓడించారు. ఇప్పుడు స్మృతిపై పోటీకి ప్రియాంక పేరును కూడా పరిశీలిస్తున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి గెలిచిన సోనియా ఆ తర్వాత నియోజకవర్గంలో అంతగా పర్యటించ లేదు. ఈసారి ఇక్కడ రాహుల్‌ పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.

అభ్యర్థుల వడపోతకు స్ర్కీనింగ్‌ కమిటీలు

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను వడపోయటానికి కాంగ్రెస్‌ ఐదు స్ర్కీనింగ్‌ కమిటీలను శుక్రవారం ఏర్పాటు చేసింది. దీనికోసం రాష్ట్రాలను, యూటీలను ఐదు క్లస్టర్లుగా విభజించి, ఒక్కో క్లస్టర్‌కు బాధ్యులను నియమించింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌, పుదుచ్చేరిలతో కూడిన క్లస్టర్‌కు స్ర్కీనింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా హరీశ్‌ చౌదరి, సభ్యులుగా జిగ్నేశ్‌ మేవానీ, విశ్వజీత్‌ కదమ్‌లను నియమించింది. ఏపీ, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్‌ నికోబార్‌ దీవులు మరో క్లస్టర్‌గా ఉంటాయి. దీనికి మధుసూదన్‌ మిస్త్రీ సారథ్యం వహిస్తారు. మరోవైపు కాంగ్రెస్‌ మహిళా, విద్యార్థి విభాగాలకు కొత్త సారథులను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు ఖర్గే శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. మహిళా కాంగ్రె్‌సకు అల్కా లాంబాను, ఎన్‌ఎ్‌సయూఐకి వరుణ్‌ చౌదరిని అధ్యక్షులుగా నియమించారు.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours