Indiramma House Scheme : ఇందిరమ్మ ఇల్లు.. స్థలం ఉన్న వారికే

రేషన్‌ కార్డు ఉంటేనే పథకానికి అర్హత?

11 నుంచి తొలి విడత పథకం అమలు

భద్రాచలంలో ప్రారంభించనున్న రేవంత్‌

నియోజకవర్గానికి 3,500 గృహాలు మంజూరు

వచ్చే ఆర్థిక ఏడాది 4,16,500 ఇళ్లు లక్ష్యం

త్వరలోనే మార్గదర్శకాలు.. లబ్ధిదారుల ఎంపిక

రెండో దశలో ఇళ్ల స్థలాలు లేని వారికి పథకం

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న లాంఛనంగా ప్రారంభించేందుకు కాంగ్రెస్‌ సర్కారు కసరత్తులు ముమ్మరం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా భద్రాచలం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు పథకం అమలుకు సంబంధించిన కీలక అంశాలపై దృష్టిసారించారు. తొలి విడతలో.. సొంత స్థలం, రేషన్‌ కార్డు ఉన్న వారికే పథకాన్ని అందించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రెండో దశలో స్థలాలు లేని వారికి స్థలం అందించి, ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు సమాచారం. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు మంజూరు కానున్నాయి. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారుకు రూ.5 లక్షలు ఇస్తారు. పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేసి, ఆ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా.. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, గృహ జ్యోతి, రైతు భరోసా, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. దాదాపు 30-40 లక్షల మంది అర్హులు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్టు సమాచారం. పథకం కోసం వచ్చిన దరఖాస్తుల్లో చాలా వాటిలో లబ్ధిదారులు రేషన్‌ కార్డు నంబర్లు వేయలేదు. దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే గ్రామ సభల్లోనూ మరోసారి ఆయా దరఖాస్తులను పరిశీలించనున్నారు. అయితే గ్రామ సభల్లో వివరాలను నమోదు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక నమూనా పత్రాన్ని సిద్ధం చేసింది. దాని ప్రకారమే దరఖాస్తుదారుల వివరాలను సేకరించనున్నట్టు తెలుస్తోంది.

క్షేత్రస్థాయిలో పరిశీలన..

ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా..? అనర్హులా..? అనే అంశాన్ని ప్రభుత్వం మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి ఖరారు చేయనుంది. మార్గదర్శకాల విడుదల అనంతరం ఇందుకోసం క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని నిర్ణయించింది. గ్రామం నుంచి మొదలుకుని మునిసిపాలిటీల్లోని వార్డుల వరకు ప్రత్యేక పరిశీలన అధికారి, పలు బృందాలతో సభలను నిర్వహించనున్నట్టు సమాచారం. ఆ సభల్లో దరఖాస్తుదారులు పథకానికి అర్హులా..? కాదా..? అనే విషయాలను తేల్చేందుకు సర్కారు ప్రత్యేకంగా ‘క్షేత్రస్థాయి పరిశీలన పత్రం’ తయారుచేసింది. అందులో దరఖాస్తుదారు ఆధార్‌, రేషన్‌ కార్డు నంబర్లను అడిగారు. దీని ప్రకారం ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే కచ్చితంగా ఆహార భద్రత కార్డు ఉండాల్సిందేనని స్పష్టమవుతోంది. అన్ని వివరాలతో పాటు ఆహార భద్రత కార్డు నంబరును కూడా క్షేత్రస్థాయి పరిశీలన బృందం నమోదు చేయనుంది. దీంతో పాటు దరఖాస్తుదారు గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.

దరఖాస్తుదారులు అర్హులు అయి, ఇంటి స్థలం ఉన్న వారైతే.. ఆ స్థలం సొంతమేనా..? డీ- ఫాం పట్టానా..? లేదా పూర్వీకుల నుంచి వచ్చిందా..? అనే వివరాలను సేకరించనున్నారు. ఇంటి స్థలం లేని వారు.. స్థలం ఇవ్వాలని కోరేలా పరిశీలనా పత్రంలో ఆప్షన్‌ పెట్టారు. సిమెంటు రేకుల షెడ్డు ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే అనర్హులుగా పరిగణించనున్నారు. కాగా, ఈ మొత్తం ప్రక్రియ కోసం గ్రామస్థాయి సిబ్బందిని వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది.

సీఎం భద్రాద్రి పర్యటనపై కసరత్తు

భద్రాచలం, మార్చి 4: సీఎం హోదాలో రేవంత్‌ రెడ్డి తొలిసారిగా ఈ నెల 11న భద్రాచలం వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆయన పర్యటన కోసం కసరత్తులు ప్రారంభించింది. సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేసేందుకు కలెక్టర్‌ ప్రియాంక మంగళవారం సమావేశం నిర్వహించనున్నారు. కాగా, ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి వేడుకకు సీఎం రేవంత్‌రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తారని అధికారులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే ఆయన రామయ్య దర్శనానికి వచ్చి ఆలయ అభివృద్ధిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

11 నుంచి పథకం ప్రారంభం

సత్తుపల్లి, మార్చి 4: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఈ నెల 11న భద్రాచలంలో ప్రారంభిస్తారని సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అదే రోజు సీతారామ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి సమీక్షిస్తారని తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి అధికారుల సమావేశం, మునిసిపల్‌ బడ్జెట్‌ సమావేశాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగు పథకాలను అమలు చేశామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టారని, ఇప్పటికే మెగా డీఎస్సీ చేపట్టారని తెలిపారు. ఏ ఏ శాఖల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందో గుర్తించి, అవసరాన్ని బట్టి వెంటనే పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. గడిచిన 75 రోజుల్లో 25 వేల ఉద్యోగాలను ఇచ్చామని తెలిపారు. ధరణి ప్రక్షాళనలో భాగంగా కమిటీని నియమించామని, ఆ కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈలోగా ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 2లక్షలకు పైగా దరఖాస్తులను పరిష్కరించేందుకు అన్ని స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశామని శ్రీసవాసరెడ్డి తెలిపారు.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours