City Empty: పల్లెకళ ముందు వెలవెల!

సంక్రాంతికి తరలిన జనం.. ఖాళీగా హైదరాబాద్‌

బోసిపోయిన రోడ్లు, కూడళ్లు, సిటీ బస్‌ స్టాపులు, మాల్స్‌

హైదరాబాద్‌ సిటీ, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, జనవరి 14(ఆంధ్రజ్యోతి): పట్నానికి పట్నం బండి గీరలు కట్టుకొని పల్లెకు తరలిపోయిందా? ఎందుకంటే మన హైదరాబాద్‌ హైదరాబాద్‌ మాదిరిగా కనిపించడం లేదు మరి! నిత్యం రద్దీగా ఉండే రోడ్లు ఊపిరి పీల్చుకుంటున్నాయి. పొద్దుట్నుంచి రాత్రి దాకా కనిపించే ఆ వాహనాల వరుస.. ట్రాఫిక్‌ జాంలు లేవు. దద్దరిల్లిపోయే హారన్ల మోత లేదు. గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేసినట్లు రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి! మియాపూర్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, హైటెక్‌సిటీ, ఎల్బీనగర్‌ సహా ప్రధాన కూడళ్లను చూస్తే నిత్యం రద్దీగా కనిపించే ఆ కూడళ్లేనా? అనిపించాయి. కిటకిటలాడే సిటీ బస్సుల్లో జనమే లేరు. వెలుగుజిలుగుల షాపింగ్‌ మాల్స్‌దీ అదే వెలవెల! ఇదంతా భాగ్యనగరమ్మీద సంక్రాంతి పండుగ వేసిన సంబురాల వల! పూతరేకులు, అరిసెలు, జంతికల రుచులు.. కోడిపందాల సందళ్ల మధ్య సంక్రాంతి మజాను ఆస్వాదించాలంటే పుట్టి పెరిగిన ఊళ్లోనే సాధ్యం! సో.. బిజీలైఫ్‌ అనే చట్రం నుంచి బయటపడి.. పచ్చని పల్లెల్లో వాలిపోయి ఆప్తుల పలకరింపుల మధ్య సేదతీరేందుకు నగర జనం పల్లెకు పోయింది. ఫలితంగా ఏదో మంత్రం వేసినట్లుగా హైదరాబాద్‌ ఖాళీ అయిపోయింది. బోగి పండుగ ముందురోజు వరకు కిక్కిరిసిపోయిన హైదరాబాద్‌ మహానగరం.. ఆదివారం బోసిపోయింది. సిటీ బస్సులు పెద్దగా కనిపించలేదు. ఆ బస్సుల్లోనూ జనం కనిపించలేదు. బస్‌ స్టాపులు, సూపర్‌ మార్కెట్లూ ఖాళీగా కనిపించాయి. రద్దీ లేకపోవడంతో రోడ్లపై వాహనదారులు ఝమ్మంటూ దూసుకెళ్లారు. ట్రాఫిక్‌ రద్దీ మధ్య నగర రోడ్ల మీద కొన్నిసార్లు 10 కి.మీ ప్రయాణానికే గంట సమయం పట్టేది. ఆదివారం 20 కి.మీ ప్రయాణాన్ని కూడా అరగంటలోనే ముగించి గమ్యస్థానాలకు చేరుకున్నారు. కాలనీలు, బస్తీల్లో మాత్రం చిన్నారులు పతంగుల ఎగురవేస్తూ సందడి చేశారు. ట్యాంక్‌బండ్‌, అమరవీరుల స్థూపం, సెక్రటేరియట్‌, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వంటి ప్రాంతాల్లో జనం సందడి బాగా కనిపించింది. పండుగ రోజును ప్రశాంతంగా, సంతోషంగా గడపడానికి పిల్లాపాపలతో నగరవాసులు అక్కడికి చేరుకొని పతంగులు ఎగురవేయడం, పలు పర్యాటక ప్రాంతాలను తిలకించి ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్‌ చేశారు.

బస్‌, రైల్వే స్టేషన్లు కిటకిట..

సంక్రాంతికి జనం సొంతూళ్లకు వెళుతుండటంతో మూడు రోజులుగా ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటాలాడుతున్నాయి. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ బస్టాండ్లలో ఆదివారం ఉదయం ప్రయాణికుల రద్దీ కనిపించింది. రాత్రి 7 గంటల వరకు గ్రేటర్‌నుంచి రెగ్యులర్‌ సర్వీసులతో పాటు 600 ప్రత్యేకబస్సులు జిల్లాలకు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పండుగ కోసం టీఎస్‌ ఆర్టీసీ 4,484 ప్రత్యేక బస్సులు నడపాలని ముందుగా నిర్ణయించినా ఆర్టీసీ ప్రయాణికుల రద్దీభారీగా పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా 6,261 ప్రత్యేక బస్సులను ఏపీ, తెలంగాణ జిల్లాలకు నడిపింది. శనివారం ఒక్క రోజు గ్రేటర్‌ నుంచి 1,861 స్పెషల్‌ సర్వీసులు ఏపీ, తెలంగాణ జిల్లాలకు నడిపించారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో 1127 సిటీ బస్సులను తెలంగాణలోని పలు జిల్లాలకు నడిపించారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో గ్రేటర్‌ నుంచి తెలంగాణ జిల్లాలకు ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రికార్డుస్థాయిలో మహిళలు ప్రయాణాలు సాగించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ, బస్సుల ఆపరేషన్స్‌ నిర్వహణకు మొదటిసారి ఆర్టీసీ బస్‌భవన్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రయాణికులను సొంతూళ్లకు చేర్చడంలో పాలుపంచుకున్న టీఎస్‌ ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ఎక్స్‌వేదికగా అభినందనలు తెలిపారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 52.78 లక్షల మంది ప్రయాణాలు సాగించినట్లు అధికారులు వెల్లడించారు. పండుగకు జిల్లాలకు వెళ్లిన ప్రజలు తిరిగి నగరానికి చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణ జిల్లాల్లో బస్సుల సంఖ్య పెంచిన ఆర్టీసీ, ఏపీ జిల్లాలకు ప్రత్యేక సర్వీసుల సంఖ్య తగ్గించడంతో వేలాదిమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఏపీ బస్సుల్లో డైనమిక్‌ చార్జీల పేరుతో రిజర్వేషన్‌ బస్సుల్లో చార్జీలు పెంచారంటూ పలువురు ప్రయాణికులు అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. కాగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పలు జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ఆదివారం రద్దీగా మారింది. సికింద్రాబాద్‌ నుంచి ఏపీకి వైపు వెళ్లే ప్యాసింజర్‌ రైళ్లలో భారీరద్దీ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంటర్‌ సిటీ, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లోని రిజర్వేషన్‌ బోగీల్లో సాఽధారణ ప్రయాణికులు ఎక్కడంతో ప్రయాణికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అన్ని ప్లాట్‌ ఫామ్స్‌లో ప్రయాణికుల రద్దీతో పండుగ ప్రయాణ సందడి కనిపించింది. ప్రయాణికులను అదుపు చేయడంలో ఆర్పీఎఫ్‌, జీఆర్‌పి పోలీసులు కాస్త ఇబ్బందులు పడ్డారు.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours